- 25- నుంచి 30 శాతం తగ్గిన వానాకాలం సాగు విస్తీర్ణం
- వరి, పత్తి సహా అన్నిపంటల దిగుబడిపై ప్రభావం
- కీలక దశల్లో తేమ తగ్గడం వల్లే పెరిగిన నష్టం
- యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని సూచన
హైదరాబాద్, వెలుగు: ఎల్‌నినో ప్రభావంతో వానాకాలం సీజన్‌లో రూ.20 వేల కోట్ల వరకు పంటనష్టం జరిగి ఉండవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అంచనా వేసింది. రాష్ట్రంలో సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే వానకాలం సాగు 25 నుంచి 30 శాతం మేర తగ్గిందని, సాగైన చోట్ల కూడా సరిపడా వర్షాలు లేక దిగుబడులు పడిపోయాయని పేర్కొంది.
‘కీలక దశల్లో వర్షాలు పడకపోవడంవల్ల వరి, పత్తి పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. విత్తనాలు వేసిన తర్వాత అనేకచోట్ల పంటలు ఎండిపోయాయి. దీంతో రైతులు పెట్టుబడులకు మునిగారు’ అని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వానికి పలు సిఫార్సులతో కూడిన నివేదిక సమర్పించింది. యాసంగిలోనూ ఇవే పరిస్థితులు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని, అందువల్ల రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జానయ్య సూచించారు.
12 లక్షల ఎకరాలు తగ్గిన వరి సాగు
‘రాష్ట్రంలో సాధారణంగా వానాకాలంలో 1.45 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయి. ఈసారి లోటు వర్షపాతం కారణంగా సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. సుమారు 67 లక్షల ఎకరాల్లో సాగయ్యే వరి ఈసారి 56 లక్షల ఎకరాలకే పరిమితమైంది. వర్షాభావం వల్ల పత్తి పంట కీలక దశల్లో తగినంత తేమ అందకపోవడంతో మొక్కలు ఎదగలేదు. కాయల అభివృద్ధి, దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఇతర పంటల పరిస్థితి కూడా అనుకున్నంత ఆశాజనకంగా లేదు. వర్షాలు సకాలంలో పడకపోవడం, వానకు వానకు మధ్య విరామం ఎక్కువగా ఉండడం పంటల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపింది. ’ అని నివేదిక పేర్కొన్నది.
కీలక దశల్లో తేమ తగ్గడం వల్లే..
ఈ ఏడాది జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు రాష్ట్రంలో సాధారణంగా 740.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 615.5 మిల్లీమీటర్లే నమోదైంది. 17 శాతం లోటు ఏర్పడడంతో పాటు నెలవారీ వర్షపాతంలోనూ హెచ్చుతగ్గులు పంటలపై ప్రభావం చూపాయని నివేదిక పేర్కొంది. పంటల కీలక దశల్లో భూమిలో తేమ తగ్గిపోవడంతో దిగుబడులు తగ్గే పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేసింది. వాస్తవానికి ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడిన ప్రతిసారీ కరువు వస్తుందని భావించలేమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
గతంలో కొన్ని సందర్భాల్లో తక్కువ వర్షపాతం నమోదు కాగా.. మరికొన్ని సందర్భాల్లో సాధారణ, అధిక వర్షాలు కురిసిన సందర్భాలున్నాయని అంటున్నారు. 2023లో ఎల్‌నినో పరిస్థితులు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనట్లు వివరిస్తున్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో లోటు వర్షపాతం పంటలపై ప్రభావం చూపడంతో భారీ నష్టం వాటిల్లిందని వివరిస్తున్నారు. చెరువులు, కుంటలు, ఇతర వనరుల్లో నీటినిల్వలు ఇంకా తగ్గితే రానున్న రోజుల్లో సాగునీటి సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు.
యాసంగి సాగుపైనా ప్రభావం
ఈ ప్రభావం యాసంగి సాగుపైనా పడే అవకాశం కనిపిస్తున్నది. సాధారణంగా యాసంగిలో కోటి ఎకరాల వరకు పంటలు సాగవుతాయి. ఈసారి నీటిలభ్యతను బట్టి సాగు విస్తీర్ణం దాదాపు 70 లక్షల ఎకరాలకు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. సాధారణం కన్నా 25 నుంచి 30 శాతం మేర పంట విస్తీర్ణం తగ్గనుంది. ప్రాజెక్టులు, చెరువుల్లో నీటి నిల్వలు, అందుబాటులో ఉన్న భూగర్భ జలాలకు అనుగుణంగా సాగు సరగనుంది. ప్రధానంగా వరి సాగు విస్తీర్ణం ఘననీయంగా తగ్గే అవకాశం ఉంది
ఇవీ సిఫార్సులు..
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి నీటి సంరక్షణ, పంటల వైవిధ్యీకరణ వ్యూహాలను కచ్చితంగా అమలు చేయాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర వ్యవసాయ శాస్త్రవేత్తలు సిఫార్సు చేసింది. నీటిని అధికంగా వినియోగించే వరి సాగును రబీ సీజన్‌లో నిలిపివేయాలి. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటిపోకుండా, పంటలు ఎండిపోయి నష్టపోకుండా చూసుకోవచ్చు.తక్కువ కాలంలో చేతికి వచ్చే, కరువును తట్టుకునే ప్రత్యామ్నాయ పంటలు, పెసలు, మినుములు, శనగలు, కందులు లాంటి పప్పు ధాన్యాలు, పొద్దుతిరుగుడు, నువ్వులు, కుసుమలు, వేరుశనగ వంటి నూనె గింజలు, జొన్నలు, సజ్జలు, మక్కలు వంటి ధాన్యాలు సాగుచేసుకోవచ్చు.
